Green Chilli Chicken Fry : చికెన్ ఫ్రైను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ చికెన్ ఫ్రై లలో గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తినడానికి, స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో తినడానికి కూడా ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె- 2 టేబుల్ స్పూన్స్, దంచిన పచ్చిమిర్చి – 4, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టిన చికెన్ – అరకిలో, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, నిమ్మరసం – అర చెక్క.

గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పోడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి వేయించాలి. ముక్కలు చక్కగా వేగి నూనె పైకి తేలిన తరువాత జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.