Healthy Veg Paratha : హెల్తీ వెజ్ పరాటా.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఇవి కూడా ఒకటి. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. కూరగాయలు తినని పిల్లలకు ఇలా పరాటాలు చేసి పెట్టడం వల్ల వారికి పోషకాలు చక్కగా అందుతాయి. అల్పాహారంగా, లంచ్ బాక్స్ లోకి , స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. ఈ పరాటాలను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ వెజ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ వెజ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, క్యారెట్ తరుగు – పావు కప్పు, క్యాబేజి తరుగు – పావు కప్పు, క్యాలీప్లవర్ తరుగు – పావు కప్పు, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప – అర కప్పు, ఉడికించిన బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన చీజ్ – పావు కప్పు, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, షెజ్వాన్ సాస్ – ఒక టీ స్పూన్.
హెల్తీ వెజ్ పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పిండిని తీసుకోవాలి.తరువాత ఇందులో ఉప్పు, నూనె, పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో కూరగాయ ముక్కలన్నింటిని తీసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసి వీటిని వత్తుతూ ఉండలా అయ్యేలా చేసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీరతో పాటు మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగాకలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ ముందుగా వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత ఇందులో స్టఫింగ్ ను ఉంచి అంచులను మూసివేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ పరోటాలా వత్తుకోవాలి. తరువాత ఈ పరోటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ వెజ్ పరాటా తయారవుతుంది. దీనిని టమాట చట్నీ, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా హెల్తీ పరాటాలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.