Honey Adulteration Check : తేనె… ప్రకృతి అందించిన మధురమైన ఔషధ గుణాలు కలిగిన పదార్థాల్లో ఇది కూడా ఒకటి. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది తేనెను ఇష్టంగా తింటారు. అదే విధంగా వివిధ రకాల తీపి వంటకాల తయారీలో కూడా తేనెను వాడుతూ ఉంటారు. రుచితో పాటు తేనెలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తేనెను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేయడంలో, శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా తేనె మనకు సహాయపడుతుంది. అయితే ప్రస్తుత కాలంలో మనకు స్వచ్ఛమైన తేనె లభించడం లేదనే చెప్పవచ్చు. ఇతర ఆహార పదార్థాలను కల్తీ చేసినట్టుగానే తేనెను కూడా కల్తీ చేస్తున్నారు.
తేనెలో పంచదార, బెల్లం వంటి వాటితో సిరప్ లను తయారు చేసి కలుపుతున్నారు. ఇలా కల్తీ చేసిన తేనెను వాడడం వల్ల ప్రయోజనాలను పొందడానికి బదులుగా మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం వాడే తేనె కల్తీదా లేదా స్వచ్ఛమైనదా అని సులభంగా తెలుసుకోవచ్చు. తేనె స్వచ్ఛతను ఇంట్లోనే సులభంగా ఎలా కనుగొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. నీటిని ఉపయోగించి మనం తేనె స్వచ్ఛతను కనుగొనవచ్చు. వాటర్ డిసొల్యూషన్ టెస్ట్ ద్వారా తేనె స్వచ్చతను తెలుసుకోవచ్చు. దీని కోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలపాలి. మనం వాడే తేనె స్వచ్ఛమైనది అయితే నీటితో త్వరగా కరిగిపోకుండా నీటి అడుగు భాగంలో పేరుకుపోతుంది.
అదే కల్తీ తేనె అయితే నీటిలో త్వరగా కరిగిపోతుంది. ఈ విధంగా నీటిని ఉపయోగించి మనం తేనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. అలాగే పేపర్ టవల్ షీట్ ను ఉపయోగించి కూడా మనం తేనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. పేపర్ షీట్ మీద తేనె చుక్కని వేసి అలాగే ఉంచాలి. తేనె స్వచ్చమైనది అయితే పేపర్ షీట్ దానిని త్వరగా పీల్చుకోలేదు. మనం వేసిన తేనె కూడా అలాగే ఉంటుంది. అదే తేనె కల్తీ అయితే పేపర్ షీట్ దానిని పూర్తిగా పీల్చుకుంటుంది. ఈ చిట్కాను ఉపయోగించి కూడా మనం తేనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. అలాగే ఒక గిన్నెలో తేనెను వేసి వేడి చేయాలి. స్వచ్చమైన తేనె ఇలా వేడి చేసినప్పుడు కారామెల్ లాగా మారుతుంది. బంగారు రంగు సంతరించుకుంటుంది.
అలాగే చక్కటి వాసన వస్తుంది. అదే కల్తీ తేనె అయితే మాడిపోయి మాడిన వాసన వస్తుంది. అలాగే తేనె రంగును బట్టి కూడా మనం తేనె స్వచ్చతను తెలుసుకోవచ్చు. స్వచ్ఛమైన తేనె కాషాయం, బంగారు రంగుల్లో ఉంటుంది. తేనె లభించే విధానాన్ని బట్టి ఈ రంగులో కొంచెం తేడాఉంటుంది. అదే కల్తీ తేనె అయితే స్పష్టంగా కనిపించడంతో పాటు లేత రంగులో ఉంటుంది. ఇక తేనె నిల్వ ఉండే కొద్ది కాలం గడిచే కొద్ది స్ఫటికలుగా, మందంగా తయారవుతుంది. ఇలా మారితే తేనె స్వచ్ఛమైనదని అర్థం. అయితే తేనె ఎప్పటికి అలాగే ఉంటే అది కల్తీ తేనె అని అర్థం. అదే విధంగా వెనిగర్ ను ఉపయోగించి కూడా మనం తేనె స్వచ్చతను తెలుసుకోవచ్చు. వెనిగర్ లో తేనె వేయగానే నేరుగు వస్తే అది కల్తీ తేనె అని అర్థం. ఒకవేళ నురుగు చాలా సమయం తరువాత వచ్చినా లేదా నురుగ రాకపోయిన అది స్వచ్చమైన తేనె అని అర్థం. ఈవిధంగా ఈ చిట్కాలను వాడి మనం ఇంట్లోనే తేనె స్వచ్ఛతను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.