భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ నావల్ టాటా(86) వయోభారం కారణంగా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి దేశం మొత్తం నివాళులు అర్పించింది. ఇక ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. రతన్ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో జరిగాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. అనంతరం వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
హిందూ మతం ఆచారాల ప్రకారం భౌతికకాయాన్ని కాల్చడం లేదా భూమిలో పూడ్చడం చేస్తారు. ముస్లింలు కూడా భూమిలో పాతిపెడతారు. కానీ పార్సీ మతంలో భౌతికకాయాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం వంటివి చేయరు. ఈ సందర్భంగా పార్సీ మతంలో భౌతికకాయాన్ని ఏం చేస్తారు.. వారు అంత్యక్రియలను ఎలా నిర్వహిస్తారు అనే దానిపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. మన దేశంలో పార్సీ మతాన్ని విశ్వసించే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ మతంలో ఎవరైనా మరణిస్తే, అంత్యక్రియల విధానం అందరికంటే చాలా విభిన్నంగా ఉంటుంది. పార్సీ కమ్యూనిటీలో ఎవరైనా చనిపోతే భౌతికకాయాన్ని కాల్చడం, పూడ్చిపెట్టడం వంటివి చేయరు. ఈ మతంలో ఎవరైనా మరణిస్తే పార్సీలోని దఖ్మా అని పిలువబడే టవర్ ఆఫ్ సైలెన్స్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడే దహనం చేస్తారు.
మానవ శరీరాన్ని వారు ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు.
రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీనిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలని వీరి ఆశయం.పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్ లేదా విద్యుత్ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాస్ట్రియన్ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు.