స్మార్ట్ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు అత్యవసర వస్తువులు అయ్యాయి. ఆ ఫోన్లను వాడకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. మనం ఆ ఫోన్లను అనేక పనులకు వాడుతున్నాం. చాలా మంది బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. అలాగే మన వ్యక్తిగత సమాచారం కూడా ఫోన్లలో స్టోర్ అవుతోంది. అయితే అలాంటి ఫోన్‌ను హ్యాకింగ్ బారిన పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎంతో విలువైన మన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడమే కాకుండా, మనం డబ్బు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అయితే మరి.. మన ఫోన్ హ్యాకింగ్‌కు గురైందీ, లేనిదీ ఎలా తెలుసుకోవచ్చు.. అంటే మనకు కింద తెలిపిన సూచనలు పనికొస్తాయి. వాటిని తెలుసుకోవడం వల్ల మన ఫోన్ హ్యాకింగ్‌కు గురైందీ, కానిదీ ఇట్టే మనకు తెలిసిపోతుంది. దాంతో తగిన విధంగా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. స్పీడ్
వేగంగా పనిచేసే మన స్మార్ట్‌ఫోన్ సడెన్ గా స్పీడ్ తగ్గి, చాలా నెమ్మదిగా పనిచేస్తుందంటే అది హ్యాకింగ్ బారిన పడిందని మనం తెలుసుకోవాలి. హ్యాకింగ్ బారిన పడితే ఫోన్లో వైరస్ చేరి మన ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ వైరస్ మన డేటాను హ్యాకర్లకు చేరవేసేందుకు ఫోన్ రీసోర్స్‌లను ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. అందువల్ల మన ఫోన్ సహజంగానే నెమ్మదిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఓఎస్‌ను నూతన వెర్షన్‌కు అప్ డేట్ చేసినా, లేదా స్టోరేజ్ నిండిపోయినా.. మన ఫోన్ వేగం తగ్గుతుంది. ఒక వేళ మీ ఫోన్ గనక ఈ కారణాల వల్ల స్లో అవ్వకపోతే అప్పుడు మీ ఫోన్ కచ్చితంగా హ్యాకింగ్‌కు గురైనట్లే లెక్క. దీంతో వెంటనే స్పందించి ఫోన్ ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ను రీసెట్ చేసుకోండి. ఆ తరువాత యాంటీ వైరస్ యాప్‌తో ఫోన్ మొత్తాన్ని ఒకసారి స్కాన్ చేసుకుంటే మీ డేటా సురక్షితంగా ఉంటుంది. వైరస్లు పోతాయి.
2. వేడెక్కడం
ఫోన్లో వైరస్ యాప్‌లు బాగా చేరితే ఫోన్ పనితనం నెమ్మదించి ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా గనక జరిగితే వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఫోన్ సహజంగా బ్యాటరీ అయిపోతున్నప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు, ఇంటర్నెట్ వాడినప్పుడు, వీడియోలు చూసినప్పుడు వేడెక్కుతుంది. అలా కాకుండా ఎప్పుడూ వేడిగా ఉంటే.. కచ్చితంగా అది హ్యాకింగ్‌కు గురైనట్లే లెక్క. అలా జరిగితే వెంటనే ఫోన్‌ను పైన చెప్పిన విధంగా రీసెట్ చేసి సురక్షితంగా ఉంచుకోవచ్చు.
3. బ్యాటరీ లైఫ్
సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్ అయినా సరే సుదీర్ఘకాలం తరువాత దాని బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అయితే కొత్త ఫోన్ అయినా బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రాకపోతే అప్పుడు ఆ ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
4. మెసేజ్‌లు
మీ ఫోన్ హ్యాక్ అయితే అందులో ఉండే కాంటాక్ట్‌లు, ఈమెయిల్స్ వివరాలు హ్యాకర్లకు తెలుస్తాయి. దీంతో వారు మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ నుంచి సదరు కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు, ఈమెయిల్స్‌కు మెయిల్స్ పంపిస్తారు. మీకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒక వేళ ఇలా గనక జరిగితే కచ్చితంగా మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడిందని నిర్దారించుకుని తగిన విధంగా స్పందించి జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ సురక్షితంగా ఉంటుంది.
5. పాపప్‌లు, యాడ్స్
స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్లలో ఇంటర్నెట్ను ఆపరేట్ చేస్తునప్పుడు పాపప్‌లు, యాడ్స్ విపరీతంగా వస్తుంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి. అప్పుడు తగిన విధంగా స్పందిస్తే ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోగలుగుతారు.
6. యాప్‌లు
కొంత మంది గూగుల్ ప్లే స్టోర్ కాకుండా బయట థర్డ్ పార్టీ స్టోర్స్, వెబ్సైట్ల నుంచి యాప్‌లను ఫోన్లలో ఇన్స్టాల్ చేస్తుంటారు. నిజానికి అలా చేయడం ప్రమాదకరం. వాటిల్లో వైరస్లు బాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడుతుంది. మీరు గనక కొత్త యాప్‌లను వేయడం వల్ల పైన తెలిపిన లక్షణాలు మీఫోన్లో కనిపిస్తే వెంటనే ఆ యాప్‌లను డిలీట్ చేయడం ఉత్తమం. లేదంటే ఇంకా నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ తరువాత బాధపడీ ప్రయోజనం ఉండదు.