Aloo Kurma : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. బంగాళాదుంపతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ కుర్మా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. రుచిగా, సులభంగా ఈ ఆలూ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – పావు కిలో, నూను – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగనంత, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కరివేపాకు – కొద్దిగా.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, దాల్చిన చెక్క – 1.
ఆలూ కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ ముక్కలను మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత టమాట ముక్కలు, కారం వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి టమాట ముక్కలుమెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా కూర తయారవుతుంది. చపాతీ, పుల్కా, రోటి వంటి వాటితో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బంగాళాదుంప టమాట కూరకు బదులుగా ఇలా చేసిన ఆలూ కుర్మా కూర మరింత రుచిగా ఉంటుంది.