Egg Appam Curry : కోడిగుడ్లతో కూడా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ అప్పం కర్రీ ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. కోడిగుడ్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎగ్ అప్పం కూరను చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఎగ్ అప్పం కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ అప్పం కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 2, పసుపు – చిటికెడు, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, టమాట ఫ్యూరీ – 1/3 కప్పు, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – అర కప్పు లేదా ముప్పావు కప్పు, పన్నీర్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్.
ఎగ్ అప్పం కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కోడిగుడ్లను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత స్టవ్ మీద గుంత పొంగనాల పాత్రను ఉంచి దానిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్డు మిశ్రమాన్ని గుంతల్లో వేసి కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కోడిగుడ్డు మిశ్రమాన్నంతా గుంత పొంగనాలుగా కాల్చుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, మసాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
ఇవి వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి కలిపి బాగా వేయించుకోవాలి. తరువాత పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ముందుగా తయారు చేసిపెట్టుకున్న కోడిగుడ్డు అప్పాలను వేసి కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, పన్నీర్ తురుము, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ అప్పం కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ అప్పం కర్రీని అందరూ ఇష్టంగా తింటారు.