Kidneys Health : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే మూత్రపిండాలు నిరంతరం పని చేయాలి. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను మూత్రపిండాలు వడపోసి బయటకు పంపిస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. మన తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం, సరైన జీవన విధానాన్ని పాటించడం వంటి పలు జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మూత్రపిండా ల సమస్యల బారిన పడకుండా ఉంటాం. మూత్రపిండాల సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మూత్రపిండాల ఆరోగ్యం మనం తీసుకునే నీటి శాతం, మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం మూత్రపిండాల మీద తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. కనుక మద్యపానానికి వీలైనంత దూరంగా ఉండాలి. అప్పుడే మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చాలా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇలా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మన శరీరంలో జీవక్రియలు సోడియం పై అనగా ఉప్పు పై ఆధారపడి ఉంటాయి.
మనలో చాలా మంది రుచి కొరకు ఎక్కువగా ఉప్పును వాడుతూ ఉంటారు. అయితే ఈ అధిక ఉప్పు మూత్రపిండాల పనితీరుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ పదార్థాలు తీసుకున్నా మూత్రం ద్వారా ప్రోటీన్లు బయటకు పోతాయి. అందుకని షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన కిడ్నీలకు తగినంత నిద్రపోవడం చాలా అవసరం. మనం నిద్రపోయేటప్పుడు మూత్రపిండాల్లో కణజాలాలు పుననిర్జీవించబడతాయి. రాత్రి పూట తగినంత నిద్రపోవడం వల్ల మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
అధికంగా ప్రోటీన్ తీసుకున్నా కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇవి మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. అందువల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ ను మాత్రమే తీసుకోవాలి. మినరల్స్ మరియు విటమిన్ల లోపం కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. విటమిన్ బి6, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిల్లో నీరు ముఖ్యమైనది. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలని అప్పుడే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యల బారిన పడకుండా ఉంటాం.
అలాగే మూత్రపిండాలను సహజంగా శుభ్రపరిచే ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా నయం అవుతుంది. మూత్రపిండాలను శుభ్రపరుచుకోవడానికి గానూ మనం కొత్తిమీరను ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్తిమీర నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాలన్ని తొలగిపోయి మూత్రపిండాలు శుభ్రపడతాయి. ఈ కొత్తిమీరను నీటిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక తరిగి శుభ్రపరిచిన కొత్తిమీరను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొలిగిపోయి మూత్రపిండాలు శుభ్రపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాను పాటించడం వల్ల మూత్రపిండ సంబంధిత సమస్ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.