High BP : దుంప జాతికి చెందిన వాటిని కూడా మనం ఆహారగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బీట్ రూట్ కూడా ఒకటి. దీనిని కూరగాయగా, చక్కెర తయారీలో, పశుగ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను కూడా ఆహారంగా తీసుకుంటారు. టేబుల్ షుగర్ తయారీలో బీట్ రూట్ ను ఉపయోగిస్తారు. పేస్ట్, జామ్, ఐస్ క్రీమ్ వంటి వాటి రంగును మెరుగుపరచడానికి దీనిని వినియోగిస్తారు. శక్తిని ఇచ్చే దుంపల్లో బీట్ రూట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. బీట్ రూట్ మనకు వివిధ రంగుల్లో కూడా లభిస్తుంది.
దాదాపు రెండు వేల సంవత్సరాలుగా దీనిని ఆహారంగా తీసుకుంటున్నారు. మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో దీనిని విస్తృతంగా సాగు చేస్తున్నారు. బీట్ రూట్ కనులకు ఇంపుగా కనబడినప్పటికి దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బీట్ రూట్ ను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రక్తహీనతతో బాధపడే వారు రోజూ ఒక కప్పు బీట్ రూట్ రసాన్ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. రక్తం బాగా తయారవుతుంది.
అధిక రక్తపోటును నియంత్రించడంలో బీట్ రూట్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక రక్తపోటుతో బాధపడే వారికి మాత్రలకు బదులుగా 200 మిల్లీ లీటర్ల బీట్ రూట్ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు వైద్య శాస్త్రవేత్తలు. ఈ రసం తాగిన మూడు గంటల్లోనే 10 ఎమ్ఎమ్‌హెచ్‌జి రక్తపోటు తగ్గిందట. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల అధిక రక్తపోటు 24 గంటల పాటు నియంత్రణలో ఉన్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్న వారు నైట్రేట్ సమృద్ధిగా ఉన్న బీట్ రూట్ వంటి కూరగాయలను, ఆకుకూరలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
మన శరీరంలోని నైట్రేట్ ను నైట్రైట్ అనే రసాయనంగా ఆ తరువాత నైట్రిక్ యాసిడ్ గా మార్చే గుణం బీట్ రూట్ కు ఉంటుంది. అంతేకాకుండా రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తపోటును తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. అనేక వ్యాధులను నివారించే ఈ బీట్ రూట్ ను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.