Masala Palli : పల్లీలు.. దాదాపుగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఇవి ఉంటాయి. వంటల్లో భాగంగా వీటిని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. అంతేకాకుండా పల్లీలతో పల్లి చిక్కీ, పల్లి ఉండలు వంటి చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా పల్లీలతో ఇతర ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా కారం కారంగా కరకరలాడుతూ ఉండేలా మసాలా పల్లీని ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, శనగపిండి – పావు కప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మసాలా పల్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పల్లీలను తీసుకోవాలి. తరువాత అందులో కరివేపాకు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పకోడీల పిండిలా కలుపుకోవాలి. తరువాత కరివేపాకును వేసి కలుపుకోవాలి. ఈ పల్లీలను ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యక మంటను మధ్యస్థంగా ఉంచి ముందుగా సిద్దం చేసుకున్న పల్లి మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి.
ఈ పల్లీలను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లీ తయారవుతుంది. వీటిని గాలి తగలకుండా డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే మసాలా పల్లీని చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.