Idli Karam Podi : మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద లభించే అల్పాహారాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో కూడా వీటిని తరచుగా తయారు చేస్తూ ఉంటాం. ఈ బండ్ల మీద అలాగే హోటల్స్ లో మనకు ఇడ్లీలతో పాటు కారం పొడిని కూడా ఇస్తూ ఉంటారు. ఈ కారం పొడి, నెయ్యితో కలిపి తింటే ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి. అచ్చం బండ్ల మీద వేసే ఈ ఇడ్లీ కారం పొడిని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడిని తయారు చేయడం కూడా సులభం. ఇడ్లీ కారం పొడి ఉంటే చాలు చట్నీ, సాంబార్ లేకున్నా మనం ఇడ్లీలను తినవచ్చు. ఇడ్లీలకు మరింత చక్కటి రుచిని ఇచ్చే ఈ ఇడ్లీ కారం పొడిని బండ్ల మీద లభించే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక కప్పు, మినపప్పు – ఒక కప్పు, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – అర కప్పు, జీలకర్ర – 5 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 200 గ్రా., వెల్లుల్లి గడ్డలు – 4, పుట్నాల పప్పు – పావుకిలో, కరివేపాకు – గుప్పెడు, నిమ్మ ఉప్పు – అర టీ స్పూన్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
ఇడ్లీ కారంతయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై రంగు మారే వరకువేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి పాయలు వేసి వేయించాలి. వీటిని కూడా కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ప్లేట్ లో పుట్నాల పప్పును, నిమ్మ ఉప్పును వేసుకుని కలుపుకోవాలి.
తరువాత వీటిని కొద్దిగా జార్ లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే నెయ్యి వేసి రెండు చేతులతో ఉండలు లేకుండా బాగా కలపాలి. చివరగా ఉప్పును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం తయారవుతుంది. ఈ కారాన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారంతో తింటే ఒక ఇడ్లీని ఎక్కువే తింటారని చెప్పవచ్చు.