Idli Sambar : మనం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలను చట్నీతో పాటు సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ తో కలిపి తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇడ్లీలను తీసుకోవడానికి చేసే సాంబార్ ను కూడా కొద్దిగా వెరైటీగా తయారు చేస్తారు. ఈ సాంబార్ ను చిక్కగా ఉండేలా తయారు చేస్తారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఇడ్లీ సాంబార్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన సాంబార్ ను ఇడ్లీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది. చాలా సులభంగా మరింత రుచిగా ఇడ్లీ సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక టీ గ్లాస్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 3, ఇంగువ – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ- 1, కరివేపాకు – 2రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు, సాంబార్ పొడి – 3 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఇడ్లీ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కందిపప్పులో పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత పప్పును మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసికలపాలి. అవసరమైతే ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. తరువాత సాంబార్ పొడి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మరిగించాలి. సాంబార్ మరిగిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీ సాంబార్ తయారవుతుంది. ఇడ్లీలల్లో ఈ సాంబార్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.