Small Business Ideas : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అలాగే కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా, ఉద్యోగాలు ఉన్నవారు కూడా పట్టణంలో కన్నా సొంత ఊరిలోనే బతకడం మంచిదని నిర్ణయానికి వచ్చేసారు. చాలా మంది పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఈ నేపధ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోనే బ్రతకాలి అనేది చాలా మంది ఆలోచన. గ్రామంలోనే ఉంటూ హాయిగా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా గ్రామాల్లోని సెటిల్ అవ్వాలనుకునేవారు గ్రామాల్లో ఉంటూ ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు. వీటివలన డబ్బు సంపాదించడమే కాకుండా.. మీ గ్రామానికి కావలసిన సౌకర్యాలు కల్పించవచ్చు. మరీ గ్రామాల్లో తక్కువ పెట్టుబడి వ్యాపారాలు ఏంటి అనేది చూద్దాం.
అన్నిటికన్నా గ్రామాల్లో మొదటిగా చెయ్యదగ్గ వ్యాపారం ఏంటంటే పాల వ్యాపారం. మీకు ఆవులు, గేదెలు ఉన్నట్లయితే.. మీరు పాల వ్యాపారం మొదలుపెట్టడం ఉత్తమం. పాల వ్యాపారం చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండ నగరాల్లో నెయ్యికు డిమాండ్ పెరుగుతుంది. మీరు గనుక పాల వ్యాపారంలో ఉన్నట్లు అయితే నెయ్యి అమ్మకం అనేది లాభసాటి వ్యాపారం. ఇప్పుడు స్వచ్చమైన నెయ్యి కావాలి అంటే 800 వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాపారం మీద దృష్టి పెట్టవచ్చు.
ఎరువులు, విత్తనాల దుకాణం. ఇది గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగపడే వ్యాపారం. రైతులకు విత్తనాలు, ఎరువుల పట్ల అవగాహన కల్పిస్తూ.. ఆధునాతన పద్ధతుల వస్తువులను తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.
ఇక గ్రామాల్లో బహుసా దీన్ని మించిన వ్యాపారం లేదు. అదే కిరాణా సరుకులు అమ్మే వ్యాపారం. మీ ఇల్లు గడవడమే కాకుండా కొంత నగదుని రోజు వారీగా మీరు ఆదా చేసుకునే సదుపాయం ఇక్కడ ఉంటుంది. కాబట్టి కష్టపడగలం అనే నమ్మకం ఉంటే ఈ వ్యాపారం మొదలుపెట్టొచ్చు. ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా ఫ్యాషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దీనితో బ్లౌసులు, చిన్న పిల్లలకు మోడల్ దుస్తులు అనే వాటికి బాగా డిమాండ్ ఉంది. గ్రామాల్లో వీటికి మంచి డిమాండ్. ఈ తరుణంలో నగరాల మీద మొగ్గు చూపుతున్నారు. మీరు గనుక మంచి నైపుణ్యం ఉన్న టైలర్ ని పెడితే ఇది మంచి లాభసాటి వ్యాపారం అని చెప్పవచ్చు.