Instant Poha Sweet : అటుకులతో మనం వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఈ అటుకుల స్వీట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ అటుకుల స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడుతెలుసుకుందాం.
అటుకుల స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మందంగా ఉండే అటుకులు – ఒక కప్పు, బెల్లం తురుము – అర కప్పు, నీళ్లు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము – అర కప్పు.
అటుకుల స్వీట్ తయారీ విధానం..
ముందుగా అటుకులను నీటిలో వేసి అవి నానిపోకుండా వెంటనే నీటిని వడకట్టి అటుకులను పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి నురుగు వచ్చేలా ఉడుకుతున్నప్పుడు యాలకుల పొడి, ఎండుకొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత అటుకులు వేసి కలపాలి. బెల్లం అటుకులకు చక్కగా పట్టి అటుకులు పొడిబారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు, బాదంపప్పు, కిస్ మిస్ వేసి వేయించి అటుకుల్లో కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.