Instant Saggubiyyam Dosa : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే సగ్గుబియ్యంతో తరచూ చేసే వంటకాలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసే దోశలు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం ఉంటే చాలు ఈ దోశలను ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యంతో రుచిగా దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ సగ్గుబియ్యం దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
3 గంటల పాటు నానబెట్టిన సగ్గుబియ్యం – ఒక కప్పు, నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, పెరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ సగ్గుబియ్యం దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బియ్యం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరో జార్ లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిలో వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ కూడా పిండిలో వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని వేడి వేడి పెనం మీద దోశలా వేసుకోవాలి. ఈ దోశ గుండ్రంగా అలాగే పలుచగా రాదు. తరువాత ఈ దోశను నూనె వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ సగ్గుబియ్యం దోశ తయారవుతుంది. దీనిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ ఒకేరకం దోశలు కూడా ఇలా అప్పుడప్పుడూ వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.