Bread Uthappam : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ చేసే వంటకాలే కాకుండా బ్రెడ్ తో మం ఎంతో రుచిగా ఉండే ఊతప్పలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ ఊతప్పలు చాలా రుచిగా ఉంటాయి. దోశపిండి లేదా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పిండికి బ్రెడ్ ను కలిపి ఊతప్పలను వేసుకోవచ్చు. అందరికి నచ్చేలా బ్రెడ్ తో ఊతప్పలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ – 6, శనగపిండి – ముప్పావు కప్పు, దోశ పిండి లేదా ఇడ్లీ పిండి – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ బ్రెడ్ ముక్కలు మెత్తగా అయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి. తరువాత దీనిని చిన్న మంటపై అంచుల వెంబడి నూనె లేదా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. ఈ ఊతప్పాన్ని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఊతప్పం తయారవుతుంది. దీనిని రోటీ పచ్చడి, అల్లం చట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పిండితో మనం గుంత పొంగనాలను కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన బ్రెడ్ ఊతప్పాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.