IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – శ్రీలంక సిరీస్ అనంతరం 11 రోజులకు ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతుంది.

కాగా ఈ సారి సీజన్‌లో రెండు కొత్త టీమ్‌లు తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియాంట్స్ టీమ్‌లు మిగిలిన 8 జట్లతో పోటీ పడనున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి మొత్తం 10 టీమ్‌లు ట్రోఫీ కోసం ఆడనున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ముంబై, పూణెలలో ఉన్న 4 వేదికల్లో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు.
ఇక ఈసారి ఐపీఎల్‌లో ముంబైలో 55 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. పూణెలో 15 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 4 మ్యాచ్‌ల చొప్పున వాంఖెడె స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో జరుగుతాయి. 3 మ్యాచ్ ల చొప్పున బ్రబౌర్న్ స్టేడియం, ఎంసీఏ స్టేడియంలలో నిర్వహిస్తారు. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ను మే 30వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నిర్వహిస్తారు. అలాగే ప్లే ఆఫ్స్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు.
ఇక ఈ సారి రెండు కొత్త టీమ్‌లు రావడంతో 14 లీగ్ మ్యాచ్‌లు పెరిగాయి. గత సీజన్‌లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించగా.. ఈ సారి జట్టు టైటిల్‌ను నిలుపుకోవాలని.. ముంబై రికార్డును సమం చేయాలని భావిస్తోంది.