Jowar Pakoda : సాయంత్రం సమయాలలో చాలా మంది స్నాక్స్ గా పకోడీలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. మనం వివిధ రుచులల్లో పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. పకోడీ తయారీకి మనం ఎక్కువగా శనగ పిండిని, మైదా పిండిని వాడుతూ ఉంటాం. వీటికి బదులుగా మనం జొన్న పిండిని ఉపయోగించి కూడా పకోడీలను తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసే పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా జొన్నలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. జొన్న పిండితో రొట్టెలతోపాటు పకోడీలను కూడా తయారు చేయవచ్చు. జొన్న పిండిని ఉపయోగించి పకోడీలను ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పిండి పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – ఒక కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 4 (పెద్దవి), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, ఉప్పు – రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
జొన్న పిండి పకోడీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలను తీసుకుని అందులో నూనె, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి ఉల్లిపాయలలో ఉండే నీరు బయటకు వచ్చేలా చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లను వేసి మరీ పలుచగా కాకుండా గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయల మిశ్రమాన్ని పకోడీలలా వేసుకోవాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. బాగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న పిండి పకోడీలు తయారవుతాయి. మనం ఎక్కువగా జొన్న పిండితో రొట్టెలను తయారు చేస్తూ ఉంటాం. జొన్న పిండితో రొట్టెలనే కాకుండా అప్పుడప్పుడూ సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా పకోడీలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు జొన్న పిండిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శనగ పిండితో చేసే పకోడీలను తినడం వల్ల కొందరిలో కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు జొన్నపిండితో చేసే పకోడీలను తినడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఓ వైపు రుచి.. మరోవైపు పోషకాలను పొందవచ్చు.