Karam Palli : మనం ఆహారంగా తీసుకునే నూనె గింజల్లో పల్లీలు ఒకటి. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఈ పల్లీలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వంటల్లో వాడడంతో పాటు పల్లీలతో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో సులభంగా చేసుకోగలిగే అలాగే ఎంతో రుచిగా ఉండే కారం పల్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం పల్లి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
కారం పల్లి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి పల్లీలపై వేసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, కారం వేసి పల్లీలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం పల్లి తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా కారం పల్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కారం పల్లీలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.