Karivepaku Pachadi : మనం వంటల్లో కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకు వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కంటి చూపును మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణశక్తిని పెంపొందించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలోఇలా అనేక విధాలుగా మనకు కరివేపాకు ఉపయోగపడుతుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ కరివేపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – రెండు కట్టలు ( పెద్దవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, మినపగుళ్లు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, మినపగుళ్లు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – 5 గింజలు, పసుపు – అర టీ స్పూన్.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత ఉప్పు, చింతపండు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించాలి. తరువాత వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన కరివేపాకు, ఉప్పు , చింతపండు నానబెట్టిన నీళ్లు పోసి పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పచ్చడి, తాళింపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. వంటల్లో వేసే కరివేపాకును తినడానికి ఇష్టపడని వారు ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.