Khoya Jalebi : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో జిలేబీ కూడా ఒకటి. జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో కూడా ఈ జిలేబీ లభిస్తూ ఉంటుంది. మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల జిలేబీల్లో కోవా జిలేబీ కూడా ఒకటి. కోవాతో చేసే ఈ జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కోవా జిలేబీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు కూడా ఆడుతూ పాడుతూ ఈ కోవా జిలేబీని తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా కోవా జిలేబీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోవా జిలేజీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చికోవా – పావు కిలో, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, జాజికాయ పొడి – ఒక టీ స్పూన్, పాలపొడి – ఒక టేబుల్ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – 2 చిటికెలు, మైదాపిండి – 150 గ్రా., పంచదార – అరకిలో, నీళ్లు – 300 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కోవా జిలేబి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పచ్చికోవాను తీసుకోవాలి. తరువాత అందులో కార్న్ ఫ్లోర్, జాజికాయ పొడి, పాలపొడి, కార్న్ ఫ్లోర్, ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత మైదాపిండి వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండని మెత్తగా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని గులాబ్ జామున్ పాకం కంటే ఎక్కువగా తీగపాకం కంటే తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మరోసారి బాగా కలుపుకుని నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి. తరువాత ఈ పిండిని సిలిండర్ ఆకారంలో పొడుగ్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ ను ఒక చివరన నొక్కి పెట్టి గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ జిలేబీలను తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జిలేబీలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక నిమిషం తరువాత జిలేబీలు కాలి పైకి తేలుతాయి. ఇలా జిలేబీలు పైకి తేలగానే స్టవ్ ఆన్ చేసి వేయించాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని తీసి ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. జిలేబీలతో పాటు పాకం కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని పంచదార పాకంలో 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ జిలేబీలను పాకం నుండి తీసిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల మూడు రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ జిలేబీలను అందరూ ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా కోవా జిలేబీని తయారు చేసుకుని తినవచ్చు.