Kova Kajjikayalu : తెలుగు వారి తీపి వంటకాల్లో కోవా కజ్జికాయలు కూడా ఒకటి. లోపల కొబ్బరి మిశ్రమంతో పైన కోవాతో తయారు చేసే ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. పండుగలకు, తీపి తినాలనిపించినప్పుడు ఇలా కోవా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే కోవా కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిరన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోవా కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
ముదురు కొబ్బరికాయ – 1,బెల్లం తురుము – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 2 టేబుల్ స్పూన్స్.
కోవా కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా పచ్చికొబ్బరిపై ఉండే నల్లటి భాగాన్ని తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో మిక్సీ పట్టుకున్న కొబ్బరితురుము, బెల్లం వేసి వేడి చేయాలి. వీటిని కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి వీలుగా వచ్చే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి రాగానే యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఉండలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో చిక్కటిపాలు పోసి కలుపుతూ వేడి చేయాలి. పాల మీద మీగడను కలుపుతూ పాలను మరిగించాలి. పాలు మరిగి చిక్కబడిన తరువాత పంచదార వేసి కలపాలి. ఈ పాలు మరింత చిక్కబడి కోవాలాగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కోవాలో ఉండలు లేకుండా వత్తుతూ కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కోవాను తీసుకుని ముందుగా పలుచగా వత్తుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి ఉండను ఉంచి అంచులను మూసేసి ఉండలాగా చేసుకుని ప్లేట్ లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోవా కజ్జికాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రెండు పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా కోవా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు.