Left Over Rice Punugulu : ఒక్కోసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొందరు తాళింపు వేసుకుని తింటూ ఉంటారు. కొందరు పడేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మనం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుగులు అంటే వీటిని ఎవరూ నమ్మరు కూడా. అంతా రుచిగా ఈ పునుగులు ఉంటాయి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా పునుగులను తయారు చేసుకుని తినవచ్చు. మిగిలిన అన్నంతో రుచిగా, క్రిస్పీగా పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, శనగపిండి – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, క్యారెట్ తురుము – అర కప్పు, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పునుగుల తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని జార్ లోమ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకుని పునుగుల పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. చట్నీతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎప్పుడూ పులిహోరలు, ఫ్రైడ్ రైస్ లు మాత్రమే కాకుండా ఇలా రుచిగా, క్రిస్పీగా పునుగులను కూడా తయారు చేసుకుని తినవచ్చు.