Lemon Squash : లెమన్ స్వ్కాష్.. దీనినే నిమ్మపాకం అని కూడా అంటారు. ఇది ఒకటి ఇంట్లో ఉంటే చాలు మనం రకరకాల షర్బత్ లను తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో దీనితో చల్ల చల్లని రకరకాల షర్బత్ లను నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ లెమన్ స్వ్కాష్ ను ఒక్కసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఈ లెమన్ స్వ్కాష్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. లెమన్ స్వ్కాష్ ను సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ స్వ్కాష్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – మూడు కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు.
లెమన్ స్వ్కాష్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదారను కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత దీనిని తేనె లాంటి జిగురు పాకం వచ్చే వరకు ఉడికించాలి. సుమారు 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. పంచదార పాకం చల్లారిన తరువాత నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. దీనిని వడకట్టి గాజు సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లెమన్ స్వ్కాష్ తయారవుతుంది. దీనితో షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ లో 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ ను వేసుకోవాలి. తరువాత సబ్జా గింజలను వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల లెమ్న్ స్వ్కాష్ ను అలాగే చల్లటి నీటిని పోసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్ల చల్లటి షర్బత్ తయారవుతుంది. వేసవికాలంలో ఈ షర్బత్ ను తాగడం వల్ల రుచితో పాటు ఎండ నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు.