Palathalikalu : మనం వంటింట్లో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనకంటూ కొన్ని సాంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. వాటిల్లో పాలతాలికలు కూడా ఒకటి. పాలతాలికలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. రుచిగా పాలతాలికలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలతాలికల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – రెండు కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, పంచదార – పావు కప్పు లేదా తగినంత, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
పాల తాలికల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నీళ్లను, ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు కలిపి నీళ్లు మరిగే వరకు వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి కొద్దికొద్దిగా బియ్యం పిండిని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ బియ్యం పిండి మిశ్రమం చల్లగా అయిన తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ముందుగా గుండ్రగా చేసి తరువాత తాలికల ఆకారంలో సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత కొబ్బరి పొడిని వేసి వేయించాలి. కొబ్బరి పొడి వేగిన తరువాత అందులోనే పాలను పోసి పాలను మరిగించాలి. పాలు మరిగిన తరువాత ముందుగా చేసుకున్న పాల తాలికలను వేసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత పంచదారను వేసి కలిపి మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడిని, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలతాలికల మిశ్రమం చల్లగా అయ్యే కొద్దీ దగ్గర పడుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాల తాలికలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా రుచిగా, త్వరగా పాలతాలికలను చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.