Egg Masala Curry : కోడిగుడ్లు.. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో ఇవి ఒకటి. కోడిగుడ్లను ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కండ పుష్టికి, దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్లను చిన్న పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. కోడిగుడ్లతో చేసుకోవడానికి వీలుగా ఉండే వంటల్లో కోడిగుడ్డు మసాలా కూర కూడా ఒకటి. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, సులువుగా కోడిగుడ్లతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడి గుడ్లు – 6, నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, కారం – రెండున్నర టీ స్పూన్స్, తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 6 , ఎండుకొబ్బరి – ఒక ఇంచు ముక్క, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కోడిగుడ్డు మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకోవాలి. ఒక కళాయిలో అర టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత ఒక టీ స్పూన్ ఉప్పును, అర టీ స్పూన్ కారాన్ని, పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఒక జార్ లో తరిగిన ఉల్లిపాయలను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో టమాటా ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, జీడి పప్పు, గసగసాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపును, ధనియాల పొడిని, కారాన్ని, గరం మసాలా పొడిని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాటా గుజ్జును వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని, ఉప్పును వేసి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత వేయించిన కోడిగుడ్లను వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.