Punugulu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మినప పప్పును ఉపయోగించి చేసే ఈ ఇడ్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇడ్లీలను తయారు చేసుకునే పిండితో మనం పునుగులను కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మిగిలినప్పుడు దాంతో మనం ఎంతో రుచిగా ఉండే పునుగులను చేసుకుని తినవచ్చు. ఇడ్లీ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – రెండు కప్పులు, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పునుగుల తయారీ విధానం..
ముందుగా నీళ్లు కలపని ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత పిండిని తీసుకుని కావల్సిన పరిమాణంలో పునుగులను వేసుకోవాలి. ఈ పునుగులను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పునుగులు తయారవుతాయి. ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఈ విధంగా పునుగులను కూడా వేసుకోవచ్చు. ఈ పునుగులను టమాట చట్నీ, పల్లీ చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంలో భాగంగా లేదా సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా కూడా ఈ పునుగులను తయారు చేసుకుని తినవచ్చు.