Kodiguddu Royyala Iguru : కోడిగుడ్లు, రొయ్యలు.. మనకు పోషకాలను, శక్తిని అందించే అద్భుతమైన ఆహారాలు అని చెప్పవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే ఈ రెండింటినీ కలిపి వండుకుని కూడా తినవచ్చు. వీటిని కలిపి చేసే ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లు రొయ్యల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, ఉల్లిపాయలు – పావు కిలో, రొయ్యలు – అర కిలో, నూనె – 50 గ్రాములు, పచ్చి మిర్చి – 4, కారం – 2 టీస్పూన్లు, అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి – 1, పసుపు – కొద్దిగా, గరం మసాలా – ఒక టీస్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, ఉప్పు – రుచికి సరిపడా.
కోడిగుడ్లు రొయ్యల ఇగురు తయారు చేసే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గుడ్లు పెట్టి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తరువాత పెంకు తీసి గాట్లు పెట్టి ఉంచుకోవాలి. తరువాత పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకుని నూనె పొయ్యాలి. నూనె కాగాక పొట్టు తీసి కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించుకోవాలి. రొయ్యలు వేగిన తరువాత గాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగాక పక్కకు తీసి ఆ నూనె లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
అవి వేగే లోపు అల్లం వెల్లుల్లి ముద్ద నూరు కోవాలి. ఉల్లి పాయలు వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా వేయించుకున్న రొయ్యలు, గుడ్లు వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కోడి గుడ్లు రొయ్యల ఇగురు రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. వేటితో తిన్నా రుచిగానే ఉంటుంది.