Mutton Paya : నాన్ వెజ్ తినే వారికి మటన్ పాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పాయ అంత రుచిగా ఉంటుంది మరీ. అంతేకాకుండా దీనిని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు కూడా చెబుతుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మటన్ పాయను రుచిగా, సులభంగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
మేక కాళ్లు – 4, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్ లేదా తగినంత, ఉప్పు – తగినంత, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక లీటర్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – 10, లవంగాలు – 3, యాలకులు – 3, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్.
మటన్ పాయ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మేక కాళ్లను తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి రుద్ది నీటితో కడిగి శుభ్రపరుచుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు వేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ ను తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
అలాగే పసుపును కూడా వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా శుభ్రపరుచుకున్న పాయను వేసి కలపాలి. అలాగే ఉప్పు, కారం, కొబ్బరి పొడి, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు మూత పెట్టి వేయించాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ముక్కను చూసి ఉడకకపోతే మరో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే నీళ్లు ఎక్కువ అయ్యి పులుసు పలుచగా ఉంటే 5 నిమిషాల పాటు మూత తీసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే అలాగే ఎంతో రుచిగా ఉండే మటన్ పాయ తయారవుతుంది. దీనిని అన్నం, రోటి, రాగి సంకటి, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.