Perugu Vada : వేసవి కాలంలో మనం మన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటాం. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటాం. అయితే వేసవిలో తినాల్సిన ఆహారాల్లో పెరుగు వడ ఒకటి. దీన్ని హోటల్స్‌లో బయట తినేకన్నా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని తినడం ఎంతో మేలు. దీంతో వేసవిలో చల్లగా ఉండవచ్చు. ఇక పెరుగు వడను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ముప్పావు కప్పు, పచ్చి మిర్చి – రెండు, అల్లం – చిన్న ముక్క, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు – మూడు టేబుల్ స్పూన్లు (ఒక ప్లేట్ కోసం), గ్రీన్ చట్నీ – రెండు టీస్పూన్లు, చింత పండు చట్నీ – రెండు టీస్పూన్లు, కారం – చిటికెడు, జీలకర్ర పొడి – చిటికెడు, చాట్ మసాలా – చిటికెడు, కొత్తిమీర – ఒక కట్ట.
పెరుగు వడ తయారు చేసే విధానం..
నానబెట్టుకున్న మినప పప్పులో పచ్చి మిర్చి, అల్లం వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. మినప పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడలుగా ఒత్తుకుంటూ నూనెలో వేయాలి. చిన్న మంటపై వడలు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. అలా వేయించుకున్న వడలను గోరు వెచ్చని నీళ్లలో వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉంచితే వడలు నీటిని గ్రహిస్తాయి. తరువాత వడలను చేతుల్లోకి తీసుకుంటూ నీరు పోయేలా ఒత్తుకుంటూ మరో ప్లేట్‌లో వేయాలి. ఇప్పుడు ఆ వడల మీద పెరుగు పోయాలి. గ్రీన్ చట్నీ, చింత పండు చట్నీ వేయాలి. కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు చల్లాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి. దీంతో రుచికరమైన పెరుగు వడలను తినవచ్చు.
ఇక గ్రీన్ చట్నీ విషయానికి వస్తే.. కొత్తిమీర, పుదీనా ఆకులను సమాన భాగాల్లో తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసి మిక్సీ పట్టాలి. మెత్తని పేస్ట్‌లా మారుతుంది. దీన్ని గ్రీన్ చట్నీగా ఉపయోగించుకోవచ్చు.