Prawns Fry : సీఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి చేపలు, రొయ్యలు. రొయ్యల్లో మనకు రెండు రకాలు లభిస్తాయి. ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు. పచ్చి రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. సరిగ్గా వండాలే కానీ పచ్చి రొయ్యల టేస్ట్ అదిరిపోతుంది. ఈ క్రమంలోనే రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్యల వేపుడును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు – అర కిలో, పసుపు- పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీల కర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – ఒక కప్పు, తరిగిన టమాట – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కరివేపాకు – 2 రెబ్బలు, కొత్తి మీర – కొద్దిగా, నూనె – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, లవంగాలు – 3, బిర్యానీ ఆకులు – 2, జాపత్రి – ఒకటి.
రొయ్యల వేపుడు తయారీ విధానం..
ముందుగా రొయ్యలను ఉప్పు , పసుపు వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ రొయ్యలలో నూనె, మసాలా దినుసులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత ఒక ఫ్రై పాన్ తీసుకుని అందులో నూనె వేసి కాగాక మసాలా దినుసులు వేయాలి. ఈ మసాలా దినుసులు కొద్దిగా ఎర్రగా అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను వేయాలి. రొయ్యలలో ఉండే నీరు అంతా వెళ్లిపోయాక, మూత పెట్టి 20 నిమిషాల పాటు స్టవ్ ను మధ్యస్థ మంటపై ఉంచి వేయించాలి. ఇప్పుడు మూత తీసి సన్నని మంటపై మరో 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అవుతుంది. దీనిని పప్పులో, పప్పు చారులో, రసంలో కాంబినేషన్ గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.