Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురైన విషయం విదితమే. తేజ్ నడుపుతున్న బైక్ సడెన్‌గా రోడ్డు మీద స్కిడ్ అవడంతో అతను అక్కడే పడిపోయాడు. దీంతో తేజ్ కాలర్ బోన్స్ విరిగిపోయాయి. ఈ క్రమంలోనే హాస్పిటల్‌లో 45 రోజులకు పైగానే ఉన్న తేజ్ కోమా దశలో ఉండి చికిత్స తీసుకున్నాడు. అయితే ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి బయటకు వచ్చాడు.

హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా సాయి ధరమ్ తేజ్ ఇంటికే పరిమితం అయ్యాడు. డాక్టర్ల సూచన మేరకు తేజ్ ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం ఎట్టకేలకు తేజ్ మీడియా ముందుకు వచ్చాడు. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తాను బాగానే ఉన్నానని.. తనకు చికిత్స అందించిన డాక్టర్లతోపాటు తన కోసం ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇక ఈ నెల 28వ తేదీ నుంచి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా చెప్పాడు. ఇన్ని రోజుల పాటు అతను కనిపించకుండా పోయేసరికి అతనికి ఏమైందా.. అని అభిమానులు ఆరాలు తీశారు. ఓ దశలో తేజ్‌కు గొంతు పోయిందని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఆరోగ్యవంతుడిగా మారి తిరిగి వచ్చాడు. ఇక తేజ్ కొత్త సినిమాకు సుకుమార్, ఎస్‌వీఎస్‌సీ బాపినీడులు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తేజ్ ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్‌ను ధరించాలని చెప్పడం కొసమెరుపు.