Malai Bread Rolls : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో మలై బ్రెడ్ రోల్స్ కూడా ఒకటి. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా బ్రెడ్ రోల్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఈ రోల్స్ తిన్నా కొద్ది తినాలనిపించేంత కమ్మగా, మెత్తగా ఉంటాయి. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బ్రెడ్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మలై బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – అర కప్పు, పాలపొడి – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, ఎల్లో కలర్ – చిటికెడు, రోజ్ వాటర్ – పావు టీ స్పూన్, మిల్క్ బ్రెడ్ స్లైసెప్ – 10.
కోవా స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పాలపొడి – అర కప్పు, పాలు – 50 ఎమ్ ఎల్, పంచదార – ఒక టేబుల్ స్పూన్, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్.
మలై బ్రెడ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పాలు పోసి కలుపుతూ వేడి చేయాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ సగం అయ్యే వరకు మరిగించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత పాలపొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి. వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని చల్లారే వరకు పక్కకు ఉంచాలి. తరువాత కోవా స్టఫింగ్ కోసం కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత పాలపొడి వేసి వేయించాలి. తరువాత పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పంచదార, బాదంపలుకులు వేసి గట్టిగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి ఉండే అంచులను తీసివేయాలి.
తరువాత పాలపొడి స్టఫింగ్ ను తీసుకుని పొడవుగా వత్తుకుని బ్రెడ్ స్లైస్ పై ఒక అంచున ఉంచి రోల్ చేసుకుని ట్రేలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిపై ముందుగా తయారు చేసుకున్న పాలను పోసి పైన డ్రై ఫ్రూట్స్ తో, చెర్రీలతో గార్నిష్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మలై బ్రెడ్ రోల్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.