Mamidi Tandra : మామిడి తాండ్ర.. దీనిని రుచి చూడని వారు.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మామిడి పండ్లతో చేసే ఈ మామిడి తాండ్ర చాలా రుచిగా ఉంటుంది. బయట మనకు ప్యాకెట్ ల రూపంలో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మామిడి తాండ్రను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.మామిడి పండ్లు ఉంటే చాలు దీనిని 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మామిడి తాండ్రను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి తాండ్ర తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడి పండ్లు – ఒక కిలో, పంచదార – 100 గ్రా., నెయ్యి – కొద్దిగా,యాలకుల పొడి – అర టీ స్పూన్.
మామిడి తాండ్ర తయారీ విధానం..
ముందుగా మామిడి పండ్ల నుండి గుజ్జును తీసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత ఈ గుజ్జును పేస్ట్ లాగా చేసుకుని కళాయిలోకి తీసుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ కు నెయ్యి రాసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు మామిడి పండ్ల గుజ్జులోనే పంచదారను కూడా వేసి వేడి చేయాలి. దీనిని కలుపుతూ మధ్యస్థ మంటపైన కలుపుతూ ఉడికించాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ ను రెండు నుండి మూడు రోజుల పాటు ఎండలో ఉంచాలి.
ఇది పూర్తిగా ఎండి పోయిన తరువాత ప్లేట్ నుండి వేరు చేసుకుని కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి తాండ్ర తయారవుతుంది. దీనిని గాలి, తడి తగలకుండా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈవిధంగా చక్కగా ఇంట్లోనే మామిడి తాండ్రను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.