Mango Burfi : మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటిని నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్లతో చేసుకోదగిన తీపి వంటకాల్లో మ్యాంగో బర్ఫీ కూడా ఒకటి. మామిడి పండ్లతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 నుండి 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్లతో ఎంతో రుచిగా ఉండే మ్యాంగో బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడిపండు ముక్కలు – 300 ముక్కలు, పాలు – 4 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 150 గ్రా., పంచదార – 100 గ్రా., మిల్క్ పౌడర్ – 2 టీ స్పూన్స్.
మ్యంగో బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మామిడిపండు ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మామిడి పండు మిశ్రమాన్ని కళాయిలో వేసి మధ్యస్థ మంటపై 4 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. తరువాత పంచదార వేసి కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత మిల్క్ పౌడర్ వేసి కలపాలి. తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు చల్లారిన తరువాత నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. 2 గంటల తరువాత బయటకు తీసి గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో బర్ఫీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.