Mango Kesari Halwa : మనం రవ్వతో చేసే తీపి వంటకాల్లో కేసరి హల్వా కూడా ఒకటి. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కేసరి హల్వాను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం లభించే మామిడి పండ్లతో మరింత రుచిగా చేసే ఈ కేసరి హల్వాను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్లతో మరింత రుచిగా ఈ కేసరి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో కేసరి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, మామిడిపండు గుజ్జు – ఒక కప్పు, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, పంచదార – 2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
మ్యాంగో కేసరి హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి చక్కగా వేయించాలి. రవ్వ వేగిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే మామిడి పండు గుజ్జు, ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా వేయించిన రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి.
కేసరి దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని నెయ్యితో సహా హల్వాలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో కేసరి హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు దీనిని తయారు చేసుకుని తినవచ్చు. మామిడి పండ్లతో చేసిన ఈ కేసరి హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.