Masala Dal : సాధారణంగా మనం పప్పుతో చేసే ఏ కూర అయినా బాగా ఇష్టంగా తింటారు. అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను మనం పప్పుతో కలిపి వండుతుంటాం. అయితే వివిధ రకాల పప్పులను కలిపి కూడా వండుకోవచ్చు. దీన్నే మసాలా దాల్ అంటారు. ఇలా అన్ని పప్పులను కలిపి వండి తినడం వల్ల అన్నింటిలో ఉండే పోషకాలను మనం ఒకేసారి పొందవచ్చు. దీంతోపాటు ప్రోటీన్లు కూడా శరీరానికి సరిగ్గా లభిస్తాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మసాలా దాల్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా దాల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు, ఎర్ర కందిపప్పు, మినప పప్పు, కంది పప్పు అన్నీ కలిపి ఒక కప్పు మోతాదులో, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, టమాటా ముక్కలు – అర కప్పు, కొత్తిమీర – ఒక కట్ట, మసాలా కోసం : వెల్లుల్లి రెబ్బలు – మూడు, ధనియాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఎండు మిర్చి – 4, అల్లం – చిన్న ముక్క. లవంగాలు – 2, మిరియాలు – అర టీస్పూన్.
మసాలా దాల్ తయారీ విధానం..
ముందుగా పప్పులన్నింటినీ కడిగి కుక్కర్‌లో వేసి రెండున్నర కప్పుల నీళ్లను పోసి మూడు విజిల్స్ వచ్చ వరకు ఉడికించుకోవాలి. తరువాత మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. ఇది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాటా ముక్కలు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి. టమాటా ముక్కలు ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలిపి ఉడికించుకున్న పప్పు వేయాలి. 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి. దీంతో రుచికరమైన మసాలా దాల్ తయారవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీ.. వేటితో తిన్నా రుచిగా ఉంటుంది. అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.