Masala Egg Pulusu Recipe : గుడ్డును మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గుడ్డును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని మనందరికి తెలుసు. గుడ్డుతో చేసే వంటకాల్లో గుడ్డు పులుసు కూడా ఒకటి. గుడ్డుతో చేసే ఈ వంటకాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ గుడ్డు పులుసును రాయలసీమ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయలసీమ స్పెషల్ గుడ్డు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – అర కప్పు, పసుపు – ముప్పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2 ( పెద్దవి), మెంతులు – పావు టీ స్పూన్, చింతపండు పులుసు – పావు కప్పు, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాయలసీమ స్పెషల్ గుడ్డు పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేయించుకోవాలి. గుడ్డు పై భాగం వేగిన తరువాత తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు వేగేటప్పుడే వాటిని మెత్తగా చేసుకోవాలి.
టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత మెంతులు, చింతపండు పులుసు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీళ్లు పోసి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు మరిగించాలి. నూనెపైకి తేలిన తరువాత ముందుగా వేయించిన కోడిగుడ్లను వేసి కొత్తిమీర చల్లాలి. దీనిని చిన్న మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాయలసీమ స్పెషల్ గుడ్డు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే గుడ్డు పులుసు కంటే కూడా ఈ విధంగా చేసిన గుడ్డు పులుసు మరింత రుచిగా ఉంటుంది.