Sonti Kashayam Recipe : చలికాలంలో మనకు సహజంగానే అనేక ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో చలి అధికంగా ఉంటుంది కనుక ఊపిరితిత్తుల్లో కఫం బాగా చేరుతుంది. అది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు, ఆస్తమా వస్తాయి. అప్పటికే ఆస్తమా ఉన్నవారికి అయితే చలికాలంలో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఊపిరి పీల్చడమే కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఒక పట్టాన తగ్గవు. అయితే చలికాలంలో శొంఠి కషాయాన్ని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది ఊపిరితిత్తుల సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో శొంఠి కషాయాన్ని తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
శొంఠి కషాయాన్ని తాగితే ఊపిరితిత్తులు కడిగేసినట్లు శుభ్రమవుతాయి. దెబ్బకు కఫం మొత్తం బయటకు వస్తుంది. దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే ఆస్తమా బాధించదు. శ్వాస కూడా సరిగ్గా ఆడుతుంది. అయితే శొంఠి కషాయాన్ని చేయడం కూడా సులభమే. ఇందుకు పెద్దగా కష్ట పడాల్సిన పనిలేదు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శొంఠి కషాయం తయారీకి కావల్సిన పదార్థాలు..
శొంఠి – రెండు అంగుళాల ముక్క, మిరియాలు – 15, తాటి బెల్లం – 4 టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, ధనియాలు – ఒక టీస్పూన్, తులసి ఆకులు – గుప్పెడు, నీళ్లు – రెండు కప్పులు.
శొంఠి కషాయాన్ని తయారు చేసే విధానం..
శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలను మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెల్లంతో సహా నీళ్లలో కలిపి అనంతరం ఆ నీటిని స్టవ్‌పై మరిగించాలి. మిశ్రమాన్ని మూడు వంతులు అయ్యే వరకు మరిగించాలి. తరువాత తులసి ఆకులను వేయాలి. అనంతరం 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్‌ను ఆఫ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని ఇలా తయారు చేసి రోజుకు ఒక కప్పు మోతాదులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పూట ఇలా తాగితే కఫం సమస్య అన్నది ఉండదు. ఊపిరి సరిగ్గా అందుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు ఉండవు. చిన్నారులకు కూడా దీన్ని ఇవ్వవచ్చు. కాకపోతే అందులో కాస్త తేనె కలిపి మిశ్రమాన్ని పలుచగా చేసి ఇవ్వాలి. దీంతో వారిలో కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. దీన్ని చలికాలంలో రోజూ తాగితే ఎంతో మేలు జరుగుతుంది.