Masala Karam : మనం ప్రతిరోజూ వంటింట్లో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్, వేపుళ్లు ఇలా అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. ఇవి రుచిగా ఉండడానికి వీటిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా ఇలా అనేక రకాల పదార్థాలను వేస్తూ ఉంటాం. ఇవి అన్ని వేస్తేనే మనం చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. వీటన్నింటిని ఒక్కొక్కటిగా వేయడానికి బదులుగా మసాలా కారాన్ని వేస్తే చాలు కూరలు మరింత రుచిగా ఉంటాయి. మసాలా కారం వేస్తే చాలు ఏ ఇతర పొడులను వేయాల్సిన అవసరం ఉండదు. మసాలా కారాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పనే అయినప్పటికి ఒక్కసారి తయారు చేస్తే సంవత్సరమంతా వాడుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్, వేపుడు వంటకాల్లో ఇలా దేనిలో అయినా దీనిని వేసుకోవచ్చు. కూరలకు మరింత రుచిని అందించే ఈ మసాలా కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
గుంటూరు ఎండుమిర్చి – 400 గ్రాములు, కాశ్మీరి మిర్చి – 100 గ్రా., దాల్చిన చెక్క – 25 గ్రా., లవంగాలు – 25 గ్రా., యాలకులు – 10 గ్రా., మిరియాలు – 10 గ్రా., శొంఠి – 10 గ్రా., తరిగిన పసుపు కొమ్ములు – 20 గ్రా., ధనియాలు – 200 గ్రా., జీలకర్ర – 30 గ్రా., ఆవాలు – 10 గ్రా., మెంతులు – 10 గ్రా., రాళ్ల ఉప్పు – 100 గ్రా., గసగసాలు – 40 గ్రా., పొట్టుతో ఉండే వెల్లుల్లి రెబ్బలు – 100 గ్రా., ఆముదం – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా కారం తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో తగినన్ని ఎండుమిర్చి వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి.ఇలా అన్నింటిని వేయించిన తరువాత వీటిని వస్త్రంపై వేసి ఎండలో పెట్టి ఎండబెట్టాలి. అలాగే కాశ్మీరి మిర్చిని కూడా వేయించి ఎండబెట్టాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా ప్లేట్ పై వేసి ఎండబెట్టాలి. తరువాత మరో కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి చిన్న మంటపై వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత శొంఠి, పసుపు కొమ్మలు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు వేయించాలి. తరువాత ఉప్పు కూడా వేసి మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత గసగసాలను కూడా వేసి కలపాలి. తరువాత ఈ దినుసులన్నింటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని ఎండబెట్టాలి. వీటిని ఒకటి లేదా రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టిన తరువాత మర ఆడించాలి. తక్కువ మొత్తంలో చేసుకున్నట్టయితే ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఇలా మర ఆడించిన తరువాత వెల్లుల్లి రెబ్బలను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి మిశ్రమాన్ని అలాగే ఆముదాన్ని కూడా ముందుగా తయారు చేసుకున్న కారం పొడిలో వేసి కలపాలి. తరువాత ఈ కారాన్ని కొద్ది కొద్దిగా జార్ లో వేసుకుంటూ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకుని డబ్బాలోకి తీసుకోవాలి. తరువాత అంతా కలిసేలా మరోసారి కలుపుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా కారం తయారవుతుంది. దీనిని సరిగ్గా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు ఫ్రై వంటకాల్లో కూడా ఈ కారాన్ని వేసుకోవచ్చు. ఈ విదంగా తయారు చేసిన మసాలా కారాన్ని వేసి చేసే వంటకాలు మరింత రుచిగా ఉంటాయి.