Masala Peanuts : పల్లీలు.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఇవి తప్పకుండా ఉంటాయి. పల్లీలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. పల్లీలతో రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వంటల్లో కూడా వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ పల్లీలతో మనం రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో మసాలా పల్లీలు కూడా ఒకటి. మసాలా పల్లీలు చాలా రుచిగా ఉంటాయి. మనకు షాపుల్లో కూడా ఈ మసాలా పల్లి ప్యాకెట్ లు లభిస్తూ ఉంటాయి. ఈ మసాలా పల్లీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఈ మసాలా పల్లీలను మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మసాలా పల్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 200 గ్రా., చాట్ మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్.
మసాలా పల్లి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలను మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. పల్లీలు దోరగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత పల్లీలను రెండు భాగాలుగా చేస్తూ వాటిపై ఉండే పొట్టును తీసివేయాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి కలపాలి. తరువాత వేయించిన పల్లీలు వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లీలు తయారవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ పల్లీలు చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా మసాలా పల్లీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.