Masala Puri Curry : గోధుమ పిండి, మైదా పిండితో చేసుకోదగిన వంటకాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పూరీలను తినడానికి మనం ఉల్లిపాయలతో పాటు బంగాళాదుంపలతో కూడా కూరను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ కూరను రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతూ ఉంటారు. ఈ కూరను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మసాలా పూరీ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పూరీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4, తరిగిన ఉల్లిపాయల – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నూనె- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు.
మసాలా పూరీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠాణీ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలిపిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
5 నిమిషాల తరువాత కసూరి మెంతి, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పూరీ కూర తయారవుతుంది. దీనిని వేడి వేడిగా పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పూరీలను తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా కూరను తయారు చేయడం వల్ల ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా పూరీలను తింటారు.