Mayadari Malligadu : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలలో మాయదారి మల్లిగాడు ఒకటి. 1973 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రం విడుదలైంది. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి బాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొందగా, ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం రూపొందడం వెనుక అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి.
మాయదారి మల్లిగాడు సినిమాని తెరకెక్కించిన ఆదుర్తి బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు తీసి చాలా నష్టపోయారు. ఆ తర్వాత తిరిగి చెన్నైకి రాగా, ఆయన శరత్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే అప్పుల్లో దారుణంగా కూరుకుపోవడంతో కొందరు శ్రేయోభిలాషులు కృష్ణతో సినిమాని చేయాలని సూచించారు. వెంటనే కృష్ణని ఆయన కలిసి సినిమా గురించి చెప్పగా కథ గురించి గానీ మరొకటి గానీ అడక్కుండానే డేట్స్ ఇచ్చేశారు. అప్పటికే చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో కృష్ణ కమిట్మెంట్ కాగా, వారందరినీ కాదని ఆదుర్తికి ఒకే చెప్పారు.
ఇక ఈ సినిమా కోసం అన్నపూర్ణ పిక్చరర్స్ వాళ్ళు ముందుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ కి ఒప్పుకుంటూ బ్లాక్ అండ్ వైట్ లోనే తీయాలని, పెట్టుబడి రూ.8లక్షలు ఇస్తామని కండిషన్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ కలర్లో తీద్దాం అని అన్నారట. ఆ రోజుల్లోనే తేనే మనసులు కలర్లో తీసిన మీరు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏంటని కృష్ణ అన్నారట. ఇక సినిమా పూర్తయ్యేవరకూ రెమ్యునరేషన్ తీసుకోని కృష్ణ నిర్మాతగా ఉన్న ఆదుర్తి బావమరిదికి డబ్బులు కూడా ఆఫర్ చేశారట. దీంతో రూ.11 లక్షల్లో మూవీ పూర్తయింది.
గుంటూరు ఏరియా హక్కుల్ని కృష్ణకు రెమ్యునరేషన్ గా ఆదుర్తి ఇచ్చారని టాక్. వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో కృష్ణ గళ్ళ లుంగీ, లావు బెల్టు, తెల్లని లాల్చీ, మెడల్ స్కార్ఫ్, చేతిలో కర్రతో.. రౌడీ లుక్‌లో కనిపించి అందరినీ మెప్పించారు.