Meal Maker Masala Kurma : మీల్ మేకర్ మసాలా కుర్మా.. మీల్ మేకర్ లతో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ కుర్మాను తయారు చేయడం చాలా సులభం. మీల్ మేకర్ లతో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా మీల్ మేకర్ లతో రుచిగా కుర్మాను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ మీల్ మేకర్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, నానబెట్టిన గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, మిరియాలు – 10, జీలకర్ర – అర టీ స్పూన్, చిలికిన పెరుగు – అర కప్పు, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
మీల్ మేకర్ మసాలా కుర్మా తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను వేడి నీటిలో వేసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని చేత్తో గట్టిగా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, గసగసాలు, జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన మీల్ మేకర్ వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మసాలా కుర్మా తయారవుతుంది. దీనిని వేటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మీల్ మేకర్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.