Meal Maker Roast : మీల్ మేకర్.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఇవి కూడా ఒకటి. మీల్ మేకర్ లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ మీల్ మేకర్ లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మీల్ మేకర్ రోస్ట్ కూడా ఒకటి. చికెన్, మటన్ లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ మీల్ మేకర్ రోస్ట్. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మీల్ మేకర్ లతో సులభంగా రోస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 100 గ్రా., తరిగిన టమాట – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడికి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, లవంగాలు – 5, యాలకులు – 3, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 5, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్.
మీల్ మేకర్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మీల్ మేకర్ లను వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీటిని పారబోసి చల్లటి నీటిని పోయాలి. తరువాత మీల్ మేకర్ లను చేత్తో పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. మసాలా పదార్థాలు చల్లారగానే వీటిని జార్ లోకి తీసుకుని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మీల్ మేకర్ లు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి.
మీల్ మేకర్ వేగిన తరువాత ముప్పావు కప్పు నీళ్లు కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. తరువాత మరో ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. కూరలో గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వారు మరికొద్దిగా నీటిని కూడా పోసుకోవచ్చు. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ రోస్ట్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.