Menthi Payasam : మెంతి పాయసం.. బియ్యం, మెంతులు కలిపి చేసేఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మెంతి పాయసంను తినడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా వస్తాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం చాలా సులభం. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే మెంతి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు లేదా 100 గ్రా., మెంతులు – 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరికాయ – 1, ఉప్పు – చిటికెడు, బెల్లం తురుము – 2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
మెంతి పాయసం తయారీ విధానం..
ముందుగా మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత కొబ్బరిని తీసుకుని ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీని నుండి పాలను తీసుకోవాలి. మరలా కొబ్బరిలో నీళ్లు పోసి మరలా జార్ లో వేసి మిక్సీ పట్టుకుని పాలను తీసుకోవాలి. ఇలా ఏడు నుండి ఎనిమిది కప్పుల కొబ్బరిపాలు వచ్చేలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నానబెట్టుకున్న మెంతులు, బియ్యం, 4 కప్పుల కొబ్బరి పాలు పోసి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కుక్కర్ మూత తీసి అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మిగిలిన కొబ్బరిపాలు, ఉప్పు వేసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత వడకట్టి ముందుగా ఉడికించిన పాయసంలో వేసి కలపాలి. తరువాత ఈ కుక్కర్ ను మరలా స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై ఉడికించాలి. పాయసం ఉడికి దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతి పాయసం తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.