Methi Perugu Pachadi : మనం పెరుగుతో రకరకాల పెరుగు పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. పెరుగుతో చేసే పెరుగు పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో తినడానికి పెరుగు పచ్చళ్లు చాలా చక్కగా ఉంటాయి. మనం సులభంగా , రుచిగా చేసుకోదగిన రుచికరమైన పెరుగు పచ్చళ్లల్లో మేథి పెరుగు పచ్చడి కూడా ఒకటి. మేథి పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ మేథి పెరుగు పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ మేథి పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేథి పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలికిన పెరుగు – ఒక కప్పు, తరిగిన మెంతికూర – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, ఎండుమిర్చి – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మేథి పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత తరిగిన మెంతికూర, పసుపు వేసి కలపాలి. ఈ మెంతికూరను రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మెంతికూరను పూర్తిగా మగ్గించాలి. మెంతికూర చక్కగా మగ్గి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కకు తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెంతికూరతో చేసిన పెరుగు పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.