Minapa Pappu Janthikalu : మనం ఇంట్లో చేసే పిండి వంటకాల్లో జంతికలు ఒకటి. జంతికలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ జంతికలను మనం శనగపిండి, బియ్యం పిండి కలిపి చేస్తూ ఉంటాం. కేవలం శనగపిండి మాత్రమే కాకుండా మనం మినపప్పుతో కూడా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే జంతికలు కూడా చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. మినపప్పుతో రుచిగా జంతికలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు జంతికలు తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బియ్యం పిండి – 4 కప్పులు, వాము – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మినపప్పు జంతికల తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ పప్పును 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని జంతికల పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో పిండిని ఉంచాలి.
తరువాత నూనెలో జంతికలను వత్తుకోవాలి. ఈ జంతికలను మధ్యస్థ మంటపై రెండు వైపులా నూనె నురుగు పోయే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపప్పు జంతికలు తయారవుతాయి. వీటిని స్నాక్స్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇవి చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. శనగపప్పు నచ్చని వారు, శనగపప్పు పడని వారు, కొత్త రుచులను తెలుసుకోవాలనుకునే వారు ఇలా మినపప్పుతో జంతికలను తయారు చేసుకుని తినవచ్చు.