Aloe Vera Face Pack : ముఖంపై మృతకణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోవడం వల్ల ముఖం అందవిహీనంగా, నిర్జీవంగా, కాంతివిహీనంగా తయారవుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను, దుమ్ము, ధూళిని తొలగించుకోకపోతే అది మొటిముల, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి ఇతర చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ముఖం నిర్జీవంగా మారడం వల్ల ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మనం అందంగా కనబడలేకపోతుంటాము. ఈ చిన్న చిట్కాను వాడి మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల నిర్జీవంగా మారిన చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.
ముఖాన్ని తెల్లగా మార్చే ఈ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా కలబంద గుజ్జును ఉపయోగించాల్సి ఉంటుంది. కలబంద గుజ్జులో విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మృతకణాలను, నలుపును తొలగించడంలో సహాయపడతాయి. అలాగే కలబందను వాడడం వల్ల దెబ్బతిన్న చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ముందుగా కలబందను కట్ చేసుకుని దానిలో ఉండే గుజ్జును రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమపిండిని తీసుకోవాలి. ఇప్పుడు అర చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి.
చివరగా ఇందులో 5 నుండి 6 కుంకుమ రేకులను వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకుని ఈ ప్యాక్ ను ముఖానికి వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగివేయాలి. ఈ చిట్కాను వాడడం వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు అందుతాయి. చర్మం లోతుగా శుభ్రం అవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు, మురికి, నలుపు, ముడతలు తొలగిపోతాయి. నిర్జీవంగా మారిన చర్మం కూడా కాంతివంతంగా, అందంగా తయారవుతుంది.