Mirchi Masala Fry : మనలో చాలా మంది పప్పు, సాంబార్, రసం వంటి వాటితో అప్పడాలు లేదా వడియాలను కలిపి తింటుంటారు. ఇలా తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. పప్పు, సాంబార్‌లతో కలిపి అప్పడాలు, వడియాలకు బదులుగా మనం పచ్చి మిర్చిలో మసాలా మిశ్రమాన్ని ఉంచి ఫ్రై గా చేసుకుని కూడా తినవచ్చు. పచ్చి మిర్చితో ఈ మసాలా ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిర్చి మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, పొడుగ్గా ఉన్న పచ్చి మిర్చి – 7 లేదా 8, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మిర్చి మసాలా ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును, కారాన్ని, జీలకర్రను వేసి పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని అందులోనే కొత్తిమీరను, ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా పొడిగా ఉన్నట్టయితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కానీ నూనెను కానీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చిని తీసుకుని కత్తితో పొడుగ్గా గాటు పెట్టి పచ్చి మిర్చిలో ఉండే గింజలను తీసేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగ పిండి మిశ్రమాన్ని తీసుకుని పచ్చి మిర్చిలో పెట్టుకోవాలి. ఇలా అన్ని పచ్చి మిర్చిలని తయారు చేసుకున్న తరువాత.. స్టవ్ మీద కళాయిని ఉంచి కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి మిర్చిలని వేసి మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి మసాలా ప్రై తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చి మిర్చిలని పప్పు లేదా సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. పప్పు, సాంబార్ లతో తరుచూ తినే అప్పడాలు, వడియాలకు బదులుగా ఇలా మిర్చిలని కూడా ఫ్రై చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.